తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీ వేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూన్ 2న తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించిందని వెల్లడించారు. జూన్ 2న హైదరాబాద్ అమరవీరుల స్థూపం నుండి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ చేపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ఎలా మోసపోయిందో.. ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తెలంగాణ కోసం కష్టపడ్డ ఎంపీలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు జూన్ 2న గాంధీ భవన్ లో సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఇచ్చిన స్వప్నం సాకారం కాలేదని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ నలిగిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి తప్పా ఉద్యమకారులకు ఉద్యోగాలు దక్కలేదని అన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అనిచివేసిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని.. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రజలందరినీ మోసం చేశారని అన్నారు. కేసీఆర్ కి ఓటేస్తే తెలంగాణ భూములు ఆక్రమించుకున్నారని.. సోనియా స్థానంలో వేరే వాళ్ళు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.