లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగనున్నారు. ఇప్పుడు మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై 77,829 మెజార్టీతో విజయం సాధించారు. కేసీఆర్‌తో భేటీ అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ సీటును బీఎస్పీకి కేటాయిస్తారని సమాచారం. బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.