సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు 25, 16వ డివిజన్‌లలోని నివాసితులకు గురువారం వినూత్న రీతిలో కోళ్లను పంపిణీ చేశారు. కార్పొరేటర్లు ఎడ్ల సరిత, బోనాల శ్రీకాంత్‌లు అందజేసిన కోళ్లను కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు రెండు డివిజన్ల వాసులకు పంపిణీ చేశారు. తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే గిరిజన జాతర సమ్మక్క-సారక్క జాతరలో అమ్మవారికి కోడిమాంసం సమర్పించడం ఆనవాయితీ అని.. అదేవిధంగా ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పేదలకు కోడిమాంసం పంపిణీ చేయాలని కార్పొరేటర్లు నిర్ణయించారు.
వృత్తి రీత్యా వైద్యుడైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేద వర్గాలకు చెందిన 21 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్, పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం నింపారన్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి కీలక పాత్ర పోషించాలని సూచించారు.