టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తక్షణమే ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం 15 ఏళ్లుగా అహర్నిశలు పనిచేశానని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు, భూములు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డబులు తీసుకోకుంటే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి అనుచరులు మమ్మల్ని బౌతికంగా వేధిస్తున్నారని అన్నారు. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశాడని వాపోయారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి కాకుండా.. కొత్తగా వచ్చిన వాళ్లకు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన మమ్మల్ని అణగదొక్కడానికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడని అన్నారు.