సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉండాల్సింది: కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అయ్యారు.
By అంజి Published on 7 Jan 2024 5:02 PM ISTసిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉండాల్సింది: కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరికి సాయం అందితే.. మరొకరు ఈర్ష్యా పడేలా సమాజం తయారైందన్నారు. 'బంధు' పథకాల ప్రభావం బీఆర్‌ఎస్‌పై పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగా కాకుండా సిట్టింగ్ ఎంపీల్లో కొందరి మార్పు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని ప్రస్తుత ఎంపీలు ఆందోళన చెందుతున్నారు. కాగా, 2019 సర్వాత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ఠ మూటగట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయన్నారు.
అప్పులను సాకుగా చూపించి హామీలను ఎగరగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేసి జిల్లాల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్‌ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పేరు మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు.