తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో డా.బీఆర్. అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. 'దళితబంధు వల్ల మాకు రాజకీయంగా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు మాత్రమే దళితబంధు పథకాలను అమలు చేయగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో హామీలు ప్రకటించి అమలు చేయకుండా మోసం చేసింది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కొంతమంది అంబేద్కర్‌ను ఓ వర్గానికి చెందిన నాయకుడిగా మాత్రమే అనేలా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆయన ముందు చూపుతో అనేక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు దేశం పటిష్ఠంగా ఉందన్నారు. నేడు అంబేద్కర్ జయంత్రి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా మోసాలను ప్రశ్నించాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.