దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు. రెండు ముఖ్యమైన పెట్టుబడి సమావేశాల దృష్ట్యా మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోనే ఉండిపోనున్నారు. ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకి కి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో మంత్రి కేటీఆర్ బుధవారం సమావేశా కావాల్సి ఉంది. అనంతరం రాయదుర్గంలోని బోష్ ఆఫీసును ప్రారంబిస్తారు.
ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ముందుగానే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదన్నారు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నాం 12.47 గంటలకు ప్రారంభిస్తారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నాం కేంద్ర కార్యాలయానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌ను పరిశీలించి పలు మార్పులు సూచించారు.
కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులను ఆహ్వానించారు. తొలుత పార్టీ జెండాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని, అనంతరం కార్యాలయాన్ని ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.