నాగార్జునసాగర్ వద్ద 274 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్టును పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. బుద్ధవనం ప్రాజెక్టును ప్రభుత్వం రూ.100 కోట్లతో అభివృద్ధి చేసింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టు. పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అంతర్జాతీయ బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షించేందుకు బుద్ధవనం ప్రాజెక్టులో అన్ని సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో తెలంగాణను ఇది ప్రముఖ స్థానంలో ఉంచుతుందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు స్థలంలో 40కి పైగా జాతక శిల్పాలను ఏర్పాటు చేశామని, దక్షిణాసియాతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 13 ప్రముఖ బౌద్ధ స్థూపాల ప్రతిరూపాలను కూడా అభివృద్ధి చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులో బుద్ధచరితవనం (బుద్ధుని జీవితంలోని ప్రధాన సంఘటనలు), బోధిసత్వ ఉద్యానవనం (జాతక ఉద్యానవనం), ధ్యానవనం (మెడిటేషన్ పార్క్), స్థూపా ఉద్యానవనం (చిన్న స్థూపాలు), మహాస్థూపం, బౌద్ధ మ్యూజియం, విశ్వవిద్యాలయాలు, మఠాలు వంటి ఇతర విభాగాలు ఉన్నాయని మంత్రి చెప్పారు.