నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని చెప్పుకుంటారేమో: కేటీఆర్

KTR takes jibe at BJP leaders over Oscar award to RRR. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌ ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది

By Medi Samrat  Published on  13 March 2023 10:30 AM GMT
నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని చెప్పుకుంటారేమో: కేటీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌ ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ బృందానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొణ‌తం దిలీప్ గుర్తు చేశారు. ‘‘బండి సంజయ్ లాంటి మతోన్మాదులు ఈ సినిమాపై ఎలాంటి విషం చిమ్మారో గుర్తు చేసుకోడానికి ఇది సరైన సమయం. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ద్వేషపూరిత వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచుదాం’’ అని కొణ‌తం దిలీప్ పేర్కొన్నారు. బండి సంజయ్ స్పీచ్ కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమో’’ అంటూ ట్వీట్ చేశారు. పగలబడి నవ్వుతున్న ఈమోజీ కూడా పెట్టారు.

కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది ఆస్కార్ కు భారత్ తరఫున అధికారిక చిత్రంగా గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ని పంపారు. కానీ ఎక్కడా పెద్దగా సందడి చేయలేదు. ఆర్ఆర్ఆర్ ను అధికారికంగా నామినేషన్స్ కు పంపి ఉంటే బాగున్ను అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆస్కార్ కు గుజరాత్ సినిమాను పంపించారు కానీ... ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం పంపలేదని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట ప్రదర్శన తెలుగు వాళ్లందరికీ గర్వకారణం అని.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాట టీమ్ కు తెలంగాణ ప్రభుత్వం సన్మానం ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు.


Next Story