తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న 'హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు-2026' వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేలా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సామాజిక సామరస్యం పేరుతో తెస్తున్న ఈ బిల్లు అత్యంత కఠినంగా, అస్పష్టంగా ఉందని, ఇది ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఇప్పటికే దేశంలో తగిన చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి, ఇలాంటి సమాంతర వ్యవస్థను తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ విచక్షణకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టే ఈ 'డ్రాకోనియన్' బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.