సీఎం అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయి : కేటీఆర్
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అన్నారు
By Medi Samrat Published on 4 Oct 2024 10:14 AM GMTరైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అన్నారు. 20 లక్షల మంది రైతుల రుణాలు ఇంకా మాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన ముఖ్యమంత్రి చెబుతున్న అబద్ధాలను బట్టబయలు చేసిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
2023 డిసెంబర్ 9న ఏకంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కాలేదని గుర్తు చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది ఉంటే.. అనధికారిక లెక్కల ప్రకారం అసలు సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. రైతులందరి రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా రైతు బంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కూడా చేయలేదని కేటీఆర్ అన్నారు.
65.56 లక్షల మంది రైతుల్లో 42 లక్షల మంది బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలిపారు. వారిలో 22 లక్షల మంది రుణమాఫీని పొందారని.. మిగిలిన వారికి కూడా త్వరలో లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో మొదటి టర్మ్ చివరి సంవత్సరంలో కేవలం 20 లక్షల మంది రైతుల రుణాలను మాత్రమే మాఫీ చేసిందని ఆయన అన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రూ.18,000 కోట్లు జమ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న మాట్లాడుతూ.. కొన్ని ఇబ్బందులు, సవాళ్లు ఉన్నాయని, అయితే అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.