మహిళా కమిషన్ ఎదుట హాజరవుతాను: కేటీఆర్
తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, ఆగస్టు 24న కమిషన్ ముందు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు
By Medi Samrat Published on 17 Aug 2024 5:14 PM ISTతెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు తనకు అందాయని, ఆగస్టు 24న కమిషన్ ముందు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. తనకు ఈ మెయిల్ ద్వారా ఈ నోటీసులు అందాయని.. 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై జరిగిన దాడులను వివరిస్తానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు గాను నిన్ననే బహిరంగ క్షమాపణ చెప్పానని.. అయినప్పటికీ తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్న మాటలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారో మహిళా కమిషన్‌ను అడుగుతానని కేటీఆర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలపై కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. గురువారం జరిగిన పార్టీ సమావేశంలోనే యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు బహిరంగంగా కేటీఆర్ క్షమాపణలు తెలిపారు.