గత BRS పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం ఉదయం 11 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. మాజీ మంత్రి T. హరీష్ రావుతో సహా ఇప్పటివరకు SIT పిలిచిన రాజకీయ నాయకులందరూ ఫోన్ ట్యాపింగ్ బాధితులే కాబట్టి కేటీఆర్‌ను విచారించడం చాలా కీలకం.
కేటీఆర్ తనను విచారణకు పిలవడంపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢచారి వ్యవస్థ. నిఘా వ్యవస్థ అనేది శాంతిభద్రతల పరిరక్షణ కోసం, అట్లనే ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడటం కోసం 1952 నుంచి నెహ్రూ టైం నుంచి ఈరోజు వరకు ఉన్నదని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్నివేల ఫోన్లు వింటున్నారని చెప్పారు. ఇది దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్‌గా చేసేదేనని, దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదని చెప్పారు. ఇదే రేపు తాను చెప్తానని, ఇంకా కొత్తగా చెప్పేంది ఏం ఉండదని తేల్చి చెప్పారు.