మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపండి.. ఢిల్లీలో కేటీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామని కేటీఆర్ తెలిపారు
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 3:45 PM GMTతెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ కూడా ఆయన ఇదే అంశంపై మాట్లాడారు. కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజన మహిళలు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో వాళ్ల మాటల్లోనే విను అని వివరించారు.
50, 60 ఏళ్లుగా ఇదే భూమిపై ఆధారపడి బతుకున్నాం. మేము ప్రాణం పోయినా భూములు ఇవ్వమని వాళ్లు చెబుతున్నారు. అర్థరాత్రి వచ్చి పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తూ లైంగిక దాడులు, శారీరకంగా ఎలా హింసించారన్నది వాళ్లు వివరంగా చెబుతున్నారు. కొడంగల్ లో ఓటు వేసి నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు మమ్మల్ని అర్థరాత్రి కరెంట్ తీసేసి అరెస్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తున్నారు. మా ఇంట్లో మగవాళ్లను, పిల్లలను అరెస్ట్ చేశారని బాధపడుతున్నారు. అదే విధంగా కొంతమంది మా పిల్లలు 8 రోజులుగా ఎక్కడున్నారో తెలియటం లేదని చెబుతున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తాగి వచ్చి తమను ఇష్టానుసారంగా తిట్టారని చెబుతున్నారు. 9 నెలల గర్బిణీ అయిన జ్యోతి అనే మహిళ భర్తను దారుణంగా కొట్టి అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అఘాయిత్యాలను మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ను కలిసి న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారు.
భూములు ఇవ్వకుంటే మీరు ఏ విధంగా భూములు ఇవ్వరో చూస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మీ అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం మా గిరిజనులు భూములు కోల్పోవాలా అని అమాయక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తాగి వచ్చి ఆడ పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించారు. ఆడపిల్లలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడుగుతున్నారు. రైతులను కొట్టిన, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదనతో కోరుతున్నారు. చావటానికైనా సిద్ధంగా ఉన్నాం.. కానీ భూములు ఇవ్వమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడో కూడా వివరంగా చెబుతున్నారు. తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు.
పేద, గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా గుంజుకుంటున్నాడు. మణిపూర్ లో హింస, యూపీ హాస్పిటల్ లో చిన్న పిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తోంది. కానీ తెలంగాణలో గిరిజనులపై అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవ్వాళ అరాచకం నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ, చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు.
రేవంత్ రెడ్డి సోదరుడు వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి కలెక్టర్ వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతాడు.. పోలీసులు రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ సైన్యం గా వ్యవహరిస్తున్నారన్నారు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీని అడుగుతున్నాం. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో చిన్న పిల్లలు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాళ గిరిజన మహిళ అక్రందనాలు వినిపించటం లేదని దుయ్యబట్టారు.
మీరు బిజీగా ఉంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కలుస్తామని బాధితులు చెబుతున్నారు. వారికి సమయం ఇవ్వండని కోరారు. గిరిజన మహిళలపై పోలీసుల అఘాయిత్యాలు, రైతులపై దమనకాండ, భూముల లాక్కొవటం గురించి మాట్లాడటం రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గిరిజనులపై పోలీసుల దమనకాండ సంఘటనపై రాహుల్ గాంధీ, మోడీ ఎందుకు స్పందించటం లేదని అడిగారు. దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరిచిపోయారా? ఎందుకు ఇప్పటి వరకు స్పందించటం లేదు. అంటే లగచర్ల లో రైతులు చనిపోయే వరకు స్పందించారా? అని ప్రశ్నించారు. మణిపూర్ లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదు. జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమన కాండను చూపించాలన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చేపట్టం కాదు.. మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపు.. రాహుల్ గాంధీని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆయనలో మరొక మనిషి ఉన్నట్టున్నాడు. చెప్పేదొకటి.. చేసేదొకటి.. రాహుల్ గాంధీ మాటలు చాలా చెబుతాడు. కానీ చేసేదేమీటో మొత్తం దేశం చూస్తోందన్నారు.
భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగవద్దని.. మీరే భూ సేకరణ చట్టం తెచ్చారు. కానీ తెలంగాణలో గిరిజనుల భూముల విలువ రూ. 60 లక్షలు అయితే రూ. 8 లక్షలు కూడా ఇవ్వటం లేదన్నారు. మీరు అదానీ గురించి చాలా మాట్లాడుతారు. కానీ తెలంగాణలో అదానీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్‌ను ప్రశ్నించారు. మణిపూర్ అంశంపై స్పందించే రాహుల్ గాంధీకి.. లగచర్ల బాధితుల అంశం కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కచ్చితంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. రాజ్యసభలో కచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు
రాహుల్ గాంధీ పేదల తలరాత మారుస్తామంటూ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారు. కానీ అదానీ, రేవంత్ రెడ్డి, మీ పార్టీ తలరాత మార్చుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు, గిరిజనులు, దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఇన్నాళ్లు జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారు అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడైనా మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలని పిలిచి హెచ్చరించండి. భూములు ఇవ్వమని రైతులు చెబితే ఇంత జులుం చేస్తారా? దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు.
తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ అంటారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. తెలంగాణలో గరీబులు, పేదల పక్షాన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు.. కాంగ్రెస్ ఆకృత్యాలపై ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడాల్సి ఉంది. కానీ బీజేపీ అసలు ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదన్నారు.
కేసీఆర్ మూఢ నమ్మకాలు నమ్ముతారని గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాస్తు పేరుతో సచివాలయం గేట్ మార్చుతున్నాడు. అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏమైందో? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ, కర్ణాటకలో ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. అందుకే జార్ఘండ్, మహారాష్ట్ర ప్రజలను నేను కోరెదొక్కటే.. కాంగ్రెస్, బీజేపీ రెండు మోసపూరిత పార్టీలే. ఆ రెండు పార్టీలను ఓడించండని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాల్సిన అవసరం మాకు లేదు. ఢిల్లీ కావాల్సిన మూటలు అందించగల సత్తా ఉన్నది రాష్ట్రంలో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే. అందుకే ఆయనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తున్నాం. ఉండాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ తర్వాత బీఆర్ఎస్ 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు.