సింగరేణి టెన్షన్.. సెంటర్ వర్సెస్ స్టేట్
KTR Letter to Union Minister Pralhad Joshi. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని నిలువునా ముంచేందుకు కుతంత్రాలు పన్నుతోందని
By Medi Samrat Published on 8 Feb 2022 1:21 PM GMTకేంద్ర ప్రభుత్వం సింగరేణిని నిలువునా ముంచేందుకు కుతంత్రాలు పన్నుతోందని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణి లాంటి సంస్థను దెబ్బతీయాలని చూస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు కోలుకోలేని విధంగా దెబ్బతినడం ఖాయమని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తే బీజేపీపై తెలంగాణ సమాజం రాజకీయంగా వేటువేయడానికి సిద్ధంగా ఉన్నదన్నారు. సింగరేణి పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కేటీఆర్ సోమవారం బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషికి లేఖ రాశారు. కేంద్రం మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని లేఖలో తెలిపారు.
సింగరేణిని ఎలాగైనా కాపాడుకొంటామని, సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్ ఓసీ -3, కేకే -6, శ్రవణపల్లి ఓసీ, కోయగూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా, వేలంలో పాల్గొనాలని నిర్దేశించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిని బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి, వేలంలో పాల్గొనాలని అనడం ఏమిటని ప్రశ్నించారు.
బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలో సింగరేణి గణనీయమైన ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్‌ఎఫ్‌ను కలిగి ఉందన్నారు. సింగరేణి రాష్ర్టానికే పరిమితం కాకుండా మహారాష్ట్రతోపాటు పలు దక్షిణాది రాష్ర్టాల్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా చేస్తూ దేశంలో విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదని తెలిపారు.
లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్‌యూగా మార్చి, అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసి ఇప్పుడు ప్రైవేటీకరించేందుకు రెడీ అయిందని విమర్శించారు. గుజరాత్‌లో అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ సంస్థకు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
బీజేపీ పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానం ఉన్నదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక 16 వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను సింగరేణి కల్పించిందని తెలిపారు. తమ దృష్టిలో కేంద్రం సింగరేణిలోని నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడంలేదని, వేల మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తున్నట్లని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో ఉద్యమాలకు కేరాఫ్‌గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కు పిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని కేటీఆర్ హెచ్చరించారు.