ఐసీయూ బస్సులు.. దేశంలోనే తెలంగాణ ప్రథమం

KTR launches mobile ICU buses in Telangana. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి

By Medi Samrat
Published on : 3 Jun 2021 9:24 PM IST

ఐసీయూ బస్సులు.. దేశంలోనే తెలంగాణ ప్రథమం
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తమవుతూ ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మొబైల్ ఐసీయూలపై దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఐసీయూ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర,ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై వీటిని ప్రారంభించారు. బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు. లార్డ్స్ చర్చితో పాటు వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సంయుక్త సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.


కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందని తెలిపారు కేటీఆర్. తొలి విడతగా రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించామని.. త్వరలోనే జిల్లాకు రెండు చొప్పున బస్సులను కేటాయిస్తామన్నారు. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం ఇదే తొలిసారని చెప్పారు. కోవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. మొబైల్ ఐసీయూ బస్సులో పేషెంట్ల కోసం 10 పడకలు,వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు,టెక్నీషియన్స్,సీసీటీవీ,లైవ్ ఇంటరాక్షన్ వీడియో, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. చాలామంది పేషెంట్లు జిల్లా కేంద్రాలు లేదా నగరాల్లోని ఆస్పత్రులకు చేరుకునే లోపే ఆరోగ్య పరిస్థితి విషమించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మొబైల్ ఐసీయూల ద్వారా అలాంటి పేషెంట్లకు బస్సులో చికిత్స అందిస్తూనే ఆస్పత్రులకు చేర్చవచ్చని.. ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు.


Next Story