హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి.. కేటీఆర్, హరీష్ రావు ఏమన్నారంటే..
KTR Harish Rao Comments On Huzurabad Bypoll Result. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు
By Medi Samrat Published on 2 Nov 2021 2:07 PM GMTహుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మరియు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులకు తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికల్లో నిర్విరామంగా పని చేశారని, పార్టీ కోసం పని చేసిన సోషల్ మీడియా వ్యారియర్లకు సైతం మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ గత 20 సంవత్సరాలలో అనేక ఎత్తుపల్లాలను చూసిందన్న కేటీఆర్.. కేవలం ఈ ఒక్క ఎన్నిక ఫలితం ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చిన పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఙతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు దన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని.. అయితే, దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారని.. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదని.. గెలిచిననాడు పొంగిపోలేదు.. ఓడినా.. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.