రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్
వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 19 Oct 2024 11:18 AM GMTవానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని తుమ్మల చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసి.. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు.
రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగింది. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారన్నారు.
ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ.? అని ప్రశ్నించారు.
పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా.? మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా.? అని ప్రశ్నలు సంధించారు. పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను దగా చేశావ్.. నీ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నావ్.. రైతులతో చెలగాటమాడితే మాడి మసి అవక తప్పదన్నారు. రుణమాఫీ మోసం చాలదన్నట్లు.. ఇప్పుడు రైతు భరోసాలోనూ దగానే.. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే.. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదన్నారు.