కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు : కేటీఆర్
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేద ప్రజల భూములను అరాచకంగా లాక్కుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By - Medi Samrat |
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేద ప్రజల భూములను అరాచకంగా లాక్కుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్... ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం న్యాయానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ, అక్రమంగా చైర్మన్ పదవులను దక్కించుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సాగలేదని అన్నారు.
ఈరోజు మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, ఖ్యాతనపల్లి మున్సిపాలిటీల్లో భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు భారత రాష్ట్ర సమితి వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని, అయితే చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ పేరుతో భూముల దందా చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ, బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందన్నారు. ఆనాడు ఫార్మా సిటీ భూముల్లో అప్పటి సిఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మిగిలిన మేధావులు పాదయాత్ర చేసి, "మాకు ఓటు వేస్తే మీ భూములు మీకు తిరిగి అప్పజెపుతాం" అని హామీ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాల తర్వాత మరో 16,000 ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేవలం తన అనుచరులకు, తన కుటుంబ సభ్యులు సోదరులకి భూములు కట్టబెట్టడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు.
ఇక నిషేధిత భూముల జాబితాను (22A) అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 లక్షల ఎకరాలుగా ఉన్న నిషేధిత భూముల సంఖ్యను ఏకంగా కోటి ఎకరాలకు పెంచి, భూ యజమానులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేస్తూ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు పెచ్చుమీరాయని, హోటళ్లు, బార్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడకుండా నిలబడిన కార్యకర్తలకు అండగా ఉంటామని, నిబంధనలు అతిక్రమించి కాంగ్రెస్‌కు వత్తాసు పలికే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.