చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించడం దుర్మార్గమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కురిపించారు. చేనేత మీద విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి మొట్టమొదట నేనే లేఖ రాస్తున్నానని.. మీరంతా కూడా లేఖలు రాయాలని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. నారాయణపేటలో చేనేత పార్కు పెడుతామని అమిత్ షా ఆరేండ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. బీజేపీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. చేనేతలకు అండగా నిలుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని.. చేనేతల చేయూతల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు అమలు చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలను ఎత్తి వేశారని విమర్శించారు.
'నేతన్నకు బీమా కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాం. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలను వారి కుటుంబాలకు అందజేస్తున్నాం. ఇప్పటికే 40,000 కు పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో చేరారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం.' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.