బర్త్ డే వేడుకల కోసం ఎవరు రావద్దు.. కేటీఆర్ విజ్ఞప్తి
KTR Birthday Celebrations. తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి
By Medi Samrat Published on 23 July 2021 12:38 PM GMT
తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.
ఈ నేపథ్యంలో రేపు తాను ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ.. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా వికలాంగులకు అందజేయాలనుకున్న ద్విచక్రవాహనాల పంపిణీ కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్ కు వస్తున్నాయని.. వాటన్నింటిని తమ కార్యాలయం క్రోడీకరించి.. ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని తెలిపింది.