తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి.. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన సమ్మెను మెచ్చుకున్నారు. సభలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కూడా హాస్టళ్లలో చదివిన వాడినే అని చెప్పారు. హాస్టళ్లలో ఉండే సాధకబాధకాలు తనకు తెలుసని అన్నారు. సమ్మె సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని.. రాజకీయాలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదన్నారు. తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను అభినందిస్తున్నానని.. పనిలేని ప్రతిపక్ష నాయకులను పిలవకుండా, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ గా ఏర్పడి మీ సమస్యలపై మీరే పోరాడడం బాగుందని అన్నారు. విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి కూడా తనకు బాగా నచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక ఆదిలాబాద్‌లోని బీడీ ఎన్టీ ల్యాబ్‌ను కేటీఆర్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఆదిలాబాద్ లాంటి పట్టణాలకు ఐటీ విస్తరించడం సంతోషకరమైన విషయమన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.