తెలంగాణ ప్రభుత్వంలో రూ.1000 కోట్ల భారీ స్కామ్‌: కేటీఆర్‌

కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వడ్ల సేకరణ, బియ్యం సేకరణలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు.

By అంజి  Published on  26 May 2024 6:45 PM IST
KTR, Telangana govt, rice procurement, scam, Telangana

తెలంగాణ ప్రభుత్వంలో రూ.1000 కోట్ల భారీ స్కామ్‌: కేటీఆర్‌

హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వడ్ల సేకరణ, బియ్యం సేకరణలో రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్లు.. మొత్తంగా వెయ్యి కోట్ల కుంభకోణం చేశారని అన్నారు.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రమేయం ఉందని కేటీఆర్‌ ఆరోపించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైస్‌మిల్లర్ల దగ్గర ఉంచిన 35 లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని విక్రయించేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ నాలుగు కంపెనీలకు టెండర్లు వేసిందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరూ ఒక కమిటీని ఏర్పాటు చేశారని, మార్గదర్శకాలను జారీ చేశారని, జనవరి 25న టెండర్లు పిలిచారని కేటీఆర్‌ ఆరోపించారు.

"ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎటువంటి ఆవశ్యకత చూపలేదు, కానీ అది జెట్ స్పీడ్‌తో ఒక రోజులో సందేహాస్పదంగా ఈ టెండర్‌లను వేగంగా మంజూరు చేసింది" అని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల వరికి గ్లోబల్ టెండర్ల పేరుతో ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. స్థానిక రైస్ మిల్లర్లు అదే వరిని క్వింటాల్‌కు రూ.2,100కు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రభుత్వం కేంద్రీయ భండార్, ఎల్‌జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, ఎన్‌ఏసీఏఎఫ్ వంటి కంపెనీలకు క్వింటాల్‌కు రూ.1,885 నుంచి 2,007 వరకు ధరలకు విక్రయించిందని ఆయన పేర్కొన్నారు.

''మిల్లర్లు క్వింటాలుకు 210 చెల్లించి కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ నాలుగు కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. క్వింటాలుకు దాదాపు 200 తగ్గించి.. 1885-2007 రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారు. ఈ టెండర్‌ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్‌ చేసి.. ప్రభుత్వానికి రూ.7500 కోట్లు చెల్లించాలని నిబంధన పెట్టింది. టెండర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఈ నాలుగు కంపెనీలు ధాన్యాన్ని లిఫ్ట్‌ చేయాలి.. తప్ప ఏ లావాదేవీల్లో పాల్గొనవద్దు. కానీ వీళ్లు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్‌ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. టెండర్లు వేసింది 1885-2007 రూపాయలకు గానీ.. క్వింటాలుకు 2230 రూపాయలు చెల్లించాల్సిందే అని రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్‌ మిల్లర్లను కాంట్రాక్ట్‌ సంస్థలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి'' అని కేటీఆర్‌ ఆరోపించారు.

కోట్లాది రూపాయల కుంభకోణంపై ప్రభుత్వం రెండు వారాలుగా మౌనం వహిస్తోందని విమర్శించారు. సన్న, ముడి వరి ధాన్యాన్ని ఒకే ధరకు టెండర్ చేయడంపై ప్రభుత్వ విధానాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పాఠశాల, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం ప్రవేశపెట్టిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉదాత్తమైన ప్రయత్నంలో అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు.

''మధ్యాహ్న భోజన పథకానికి 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం కావాలి. దీనికోసం పౌరసరఫరాల శాఖ గ్లోబల్‌ టెండర్‌ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధర 42-45 రూపాయలు ఉంది. కానీ బహిరంగ మార్కెట్‌, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు 15 రూపాయలు అదనంగా అంటే 57 రూపాయలతో టెండర్‌ ఖరారు చేశారు. 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులకు 15 రూపాయలు అదనంగా అంటే 300 కోట్ల స్కామ్‌ జరిగింది. మొత్తంగా వెయ్యి, 1100 కోట్ల స్కామ్‌ జరిగింది'' అని కేటీఆర్‌ ఆరోపించారు.

Next Story