కార్యకర్తగా ప్రారంభించి.. మంత్రి స్థాయికి ఎదిగా..

KTR About Political Entry. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి

By Medi Samrat  Published on  17 Aug 2021 10:50 AM GMT
కార్యకర్తగా ప్రారంభించి.. మంత్రి స్థాయికి ఎదిగా..

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరెంట్‌ సమస్యలను అధిగమించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న 'కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ' ఓరియంటేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో చాలా అనుమానాలు ఉండేవన్నారు. రాష్ట్రం వచ్చిన ఏడేళ్లకాలంలో కేసీఆర్‌ నాయకత్వంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.


తెలంగాణలో 17శాతం దళితులు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో దళితులు వివక్షకు గురవుతున్నారని, వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దళితబంధుతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దశలవారీగా దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత కుటుంబాలకు లాభం చేకూర్చే వరకు సీఎం కేసీఆర్‌ వదలన్నారు. రాజకీయ నాయకత్వం సరిగా పని చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే కరెంట్‌ ఉండదని అన్నారని.. సీఎం కేసీఆర్‌ ఆరు నెలల్లో కరెంటు సమస్యను పరిష్కరించారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

రైతుబంధు కోసం రెండు సీజన్లలో కలిపి 62 లక్షల మంది రైతులకు రూ.15వేల కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం అమలు తర్వాత తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఏడేళ్లుగా సవాళ్లను అధిగమించి పని చేస్తున్నామన్నారు. రైతుబంధు పథకం అమలు చేసిన సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారని.. ఇప్పుడు 11 రాష్ట్రాలు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నాయన్నారు. గతంలో వ్యవసాయం వర్షాలు, బోర్ల విూద ఆధారపడి ఉండేదని.. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంతో నీరు అందుతుందన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.

24 గంటల నాణ్యమైన, అంతరాయం లేని కరెంటు అన్ని రంగాలకు అందిస్తున్నట్లు చెప్పారు. 2014లో రాష్ట్రంలో 7,780 మెగావాట్ల కరెంటు వాడకం ఉంటే.. ఇప్పుడు 16వేల మెగావాట్లకుపైగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు. 1998లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రతి ఇంటికీ మంచినీరు అందేలా చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 23శాతం అడువులు ఉంటే.. హరితహారంతో ఇప్పుడు 28శాతానికి పెరిగాయన్నారు.

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, ఏడేళ్లలో 2.23లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా.. 15లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. ప్రస్తుతం మంత్రి స్థాయికి ఎదిగినట్లు కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ తనను ఐఏఎస్‌ చేయాలనుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు మంత్రిగా పని చేస్తున్నానన్నారు.


Next Story
Share it