పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులానే.. పీసీసీ ఎన్నిక జరిగినట్టు ఢిల్లీ వెళ్లాక తెలిసిందని.. టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని.. రేపట్నుంచి ఇబ్రహీంపట్నం-భువనగిరి వరకు పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి అన్నారు. నన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసిందని.. రేవంత్‌రెడ్డి సహా ఎవరూ నన్ను కలిసేందుకు ప్రయత్నించొద్దని.. నా దగ్గరికి వస్తే నిజమైన కార్యకర్తలు బాధపడతారని కోమటిరెడ్డి తెలిపారు.
పీసీసీ కొత్త కార్యవర్గం హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. పీసీసీ పదవి కాంగ్రెస్ కార్యకర్తకు ఇస్తారని అనుకున్నానని.. పార్టీలు మారిన వారికి పదవిని ఇచ్చారని.. ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పీసీసీ రావడంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. తాను నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గలు చూసుకుంటానని.. ఆ రెండు నియోజకవర్గాలో పాదయాత్రలు చేసి కాంగ్రెస్ ను గెలిపించుకుంటానని అన్నారు. ఇకపై మా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతానని.. గాంధీభవన్ మెట్లు ఎక్కనని.. కొత్త యువతను ప్రోత్సహిస్తానని.. తద్వారా నా రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.