మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనని అన్నారు. ఎన్నిసార్లు అడిగినా ముఖ్యమంత్రి అపాయిమెంట్ ఇవ్వలేదని.. ఉప ఎన్నిక అనగానే సీఎం కేసీఆర్ మునుగోడుకు వచ్చారని అన్నారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని.. తప్పు చేసిన వారు భయపడతారు.. నేను ఏ తప్పూ చేయలేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవం కోసమేనని చెప్పారు. అమ్ముడుపోయానని తనపై దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అమ్ముడుపోతే ఎందుకు పదవికి, పార్టీకి రాజీనామా ఎందుకు చేస్తా? అని ప్రశ్నించారు. అవినీతిపరుల చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోందని.. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులు మలి ఉద్యమానికి సిద్ధం కావాలని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.