సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు.

By Medi Samrat  Published on  24 Jan 2024 12:15 PM GMT
సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి ఈ లేఖను రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్ల కోసం భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని.. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్‌హెచ్ఏఐకి 50 శాతం నిధులు జమ చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ స్పందించలేదని.. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలని లేఖలో తెలిపారు కిషన్ రెడ్డి.

భారతమాల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే జాతీయ రహదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఎన్‌హెచ్‌ఏఐ)కి 50 శాతం నిధులు జమ చేయాలని కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల రెండు భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ కింద 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా ప్రకటించింది. 70 శాతానికి పైగా భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని గతంలో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.

Next Story