సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు : కిషన్ రెడ్డి

జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

By Medi Samrat  Published on  23 May 2024 7:06 AM IST
సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు : కిషన్ రెడ్డి

జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు కాల్పుల్లో 369 మంది విద్యార్థులు మరణించారని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మ‌లి విడత ఉద్య‌మంలో దాదాపు 1500 మంది యువకులు తమ ప్రాణాలను బలిగొన్నారని.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా వీధిన పడ్డారని గుర్తుచేశారు.

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీనేనని.. ఆమెను ఆహ్వానించి సన్మానం చేస్తామని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు.. తెలంగాణ ప్రజలే సాధించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి త్యాగాలు చేసింది తెలంగాణ ప్రజలే’’ అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు రాజకీయ నేతను ఎలా ఆహ్వానిస్తారని కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఆమెను ప్రభుత్వ కార్యక్రమానికి ఎలా ఆహ్వానిస్తారు? మీరు ఆమెను ఆహ్వానించాలనుకుంటే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు ఆహ్వానించి, సత్కరించండి. దానికి మాకేమీ అభ్యంతరం లేదు అని అన్నారు. అధికారిక కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే.. మే 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story