కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఎంతో నష్టపోయింది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 8:20 AM GMT
kishan reddy, bjp,  brs, congress, telangana,

కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఎంతో నష్టపోయింది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నం చేస్తుంటే.. ముచ్చటగా మూడోసారి తామే గెలుస్తామని అధికార పార్టీ బీఆర్ఎస్‌ దీమాగా ఉంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ.. బీజేపీ ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటుందని.. ఈ అభిప్రాయం దేశం మొత్తం ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నాయకుల పనులు ప్రగతి భవన్, గాంధీ భవన్‌ కూడా దాటవని విమర్శించారు. ఏడు దశబ్దాలుగా కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చిందని.. కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందన్నారు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. తొలి విడత తెలంగాణ ఉద్యంలో 369 మంది, మలివిడతల 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఫేక్‌ గ్యారెంటీలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అమలుకు వీలుకాని హామీలుఇస్తున్నారంటూ కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ మేనిఫెస్టో పట్ల తెలంగాణ ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేసే పార్టీ బీజేపీనే అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా బీజేపీకి జైకొడుతున్నారని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్‌ సర్కార్‌ను ఇంటికి పంపించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రచార రథాలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదన్నారు. దళితబంధు, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ ప్రజలు పోలీసులతో ప్రభుత్వం ఏదైనా చేయిస్తుందని భయపడ్డారనీ..దాంతో.. ఇప్పుడు కేసీఆర్ సర్కార్‌ మళ్లీ రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Next Story