తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు.
డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఆరు గ్యారంటీలకు రేషన్‌కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా స్వీకరించే దరఖాస్తులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు చేర్చడం లేదా పాత రేషన్ కార్డులు తీసేయడం చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, లబ్ధిదారులు ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని అన్నారు.