లక్షా 30 వేల మంది దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా : కేసీఆర్
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టిన గౌరవించుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు
By Medi Samrat Published on 13 April 2024 8:16 PM ISTదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టిన గౌరవించుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. చేవెళ్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సమస్య ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాకు ఉందని ప్రజలకు ధీమా ఉండాలె.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలతో కిందమీద చేస్తే కాంగ్రెస్ గెలిచిందన్నారు. 4 నెలల అయినా సరే వారి చిత్తశుద్ది లేదు. ఓ పాలసీ అంటూ లేదు. ఉన్న వనరులను వాడుకునే తెలివి లేదన్నారు. 10 ఏళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్ని మళ్లీ కనబడుతున్నాయన్నారు.
నేను చావు నోట్లో తలపెట్టి, ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు చాలా సమస్యలుండే.. కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్లు రైతాంగాన్ని కాపాడుకున్నాం.. రైతులను కాపాడుకునేందుకు ఒక పాలసీ పెట్టుకున్నాం.. రైతాంగానికి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 5 పథకాలు చేపట్టాం.. రైతుబంధు, నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, పంట కొనుగోలు లాంటి పథకాలతో రైతులకు ధీమా ఇచ్చామని గుర్తుచేశారు. 11 వందల గురుకుల పాఠశాలలను పెట్టుకున్నాం. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టుకున్నాం.. 5 నెలలుగా ఒక్కరికి కూడా ఓవర్సీస్ స్కాలర్ షిప్ లను ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు.
దళితులు ధనికులు కావాలని దళిత బంధు పేరుతో పది లక్షలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. దళిత బంధులో భాగంగా లక్షా 30 వేల మందికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పది లక్షలు విడుదల చేసినం.. 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళితులు, దళిత మేధావులు కచ్చితంగా నిలదీయాలన్నారు. లక్షా 30 వేల మంది దళిత బిడ్డలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం దగ్గర నేనే దీక్ష చేస్తానని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు కోసం విడుదల చేసిన పది లక్షల రూపాయల దళిత బంధు వచ్చేలా చేస్తామన్నారు.
కళ్యాణ లక్ష్మి కి తులం బంగారం కలిసి ఇస్తా అన్నారు. ప్రభుత్వానికి కొనటానికి బంగారం దొరకటం లేదా? అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు, గౌడ బిడ్డలకు, గొల్ల కురుమలకు, యాదవ్ లకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపట్టాం. బీసీ బంధు పెట్ట బలహీన వర్గాలకు మేలు చేశాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు వాటిని కొనసాగిస్తాదా? లేదా ? ప్రజలు నిలదీసి అడగాలన్నారు.
రైతులు, వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. కేసీఆర్ పక్కకు పోగానే 24 గంటల కరెంట్ ఉండకుండా పోతదా? అంటే ఇది వీళ్ల చేతగాని తనం. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందన్నారు. ఇప్పుడు కరెంట్ కు ఏం రోగం వచ్చింది. నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఇదేమీ లోపం? అని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఎందుకు పాత ప్రభుత్వం పోగానే ప్రజలకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినయ్. ప్రభుత్వాన్ని ఈ అంశాల్లో నిలదీసే అంకుశం మనకు కావాలె. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే అన్ని లోక్ సభ సీట్లు బీఆర్ఎస్ గెలవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే.. మేము ఏం చేయకపోయినా సరే ప్రజలు మమ్మల్ని గెలిపించారంటారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. లేదంటే వాళ్లు పని పక్కన పెట్టి ఎల్లెంక పంటరన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. నా ముందే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే నాకు బాధనిపిస్తోంది. నేను బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాను. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల వెంటనే ఉంటది. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది. ఎందుకు పార్టీ మారిండు ? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తులెవరు ప్రజలకు తెలిసిన వారు కాదు. ఎందుకు రంజిత్ రెడ్డి పార్టీ మారిండు. ఇలాంటి వ్యక్తులకు మీరే ధీటైన బుద్ధి చెప్పాలన్నారు.
అన్ని పంటలు కొంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. వానాకాలం పంట కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయి. మరి రూ. 500 బోనస్ ఇస్తారా? ఇయ్యారా ? ఇస్తా అని ఇవ్వకపోతే ఓట్ల రూపంలో గుద్ది వాళ్లను ఓడగొట్టాలన్నారు. హామీ ఇచ్చిన విధంగా ఆడపిల్లలకు స్కూటీలు లేవు గానీ..హైదరాబాద్ లో లూటీ మాత్రం మొదలుపెట్టినారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల అయ్యిందని ప్రశ్నించారు.
బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే మళ్లీ రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయి. మీటర్లు రావద్దంటే బీజేపీని గుద్దుడు గుద్దలే. నేలకేసి కొట్టాలె. అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్లు. తెలంగాణ లో ధాన్యం ఎక్కువగా పండింది. వాటిని కొనమంటే బీజేపీ కేంద్రమంతి మీ వారికి నూకలు తినిపియ్యండి అంటాడు. మనల్ని నూకలు తినమన్న బీజేపీని నూకలు తినిపిచ్చే పనిచేద్దామా? అని అడిగారు.
బలహీన వర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్. బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి చూపించలే అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి బీసీల శక్తి, బీసీల రాజకీయ చైతన్యాన్ని చూపించాలె. రైతు తడిసిన ధాన్యాన్ని కూడా ఒక్క గింజ వదలకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. చేవెళ్ల సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయమైందని తెలిసిపోయిందన్నారు.