అదే స్ఫూర్తిని కొనసాగిస్తేనే సామాజిక ప్రగతి సాధ్యం: కేసీఆర్
వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మాపూలే..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik
అదే స్ఫూర్తిని కొనసాగిస్తేనే సామాజిక ప్రగతి సాధ్యం: కేసీఆర్
వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మాపూలే..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సబ్బండ కులాల అభ్యున్నతి కోసం, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఫూలే ఆశయాలను అమలు చేసిందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే సామాజిక ప్రగతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. శక్తివంతమైన భారత సమాజ ఐక్యతను బలహీన పరుస్తున్న వర్ణ కుల వివక్ష నుంచి విముక్తి కోసం, తన జీవితకాలం పోరాడిన మహాత్మ జ్యోతిరావు ఫూలే భారత సామాజిక విప్లవకారుడు అని కేసీఆర్ కొనియాడారు.
ఫూలే జయంతి సందర్భంగా సబ్బండ కులాల అభ్యున్నతికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం వారు చేసిన కృషి త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. కులం, జెండర్ వంటి సామాజిక రుగ్మతను రెండు శతాబ్దాల క్రితమే పసిగట్టి, పరిష్కారం కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మ ఫూలే అని అన్నారు. ఉత్పత్తి కులాలైన సబ్బండ వర్ణాల అభ్యున్నతికి నాటి తెలంగాణ తొలి ప్రభుత్వం ఫూలే ఆదర్శాలను కార్యాచరణలో పెట్టిందని గుర్తుచేశారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలే కేంద్రంగా, భారత కుల వృత్తుల సామాజిక సాంస్కృతిక జీవన విధానం అల్లుకుని ఉన్నదని ,ఈ చారిత్రక నేపథ్యాన్ని అవగాహన చేసుకున్న నాటి తొలి తెలంగాణ ప్రభుత్వం అవే రంగాలను మొదటి పాలనా ప్రాధాన్యతగా తీసుకున్నదన్నారు.
సామాజిక న్యాయం అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందిని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు పంట పెట్టుబడి, పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం తదితర కీలక కార్యాచరణను సమాంతరంగా అమలు చేయడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు. పేద ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి వారిలో ఆర్థిక భరోసా పెంచిందన్నారు. తద్వారా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్పిన్ ఎకానమీ జరిగి, బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణ ద్వారా, దేశ ప్రగతిలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కీలక భూమికను పోషించిందని తెలిపారు.
తద్వారా వెనకబడిన వర్గాల్లో ఆత్మస్థైర్యం పెరిగి, సామాజిక ఉద్దీపన జరిగి, బీసీ ఎస్సీ కులాల సామాజిక గౌరవాన్ని ఇనుమడింప జేసిందని కేసీఆర్ అన్నారు. బీసీలుగా శతాబ్దాలుగా వెనక బడేసిన కులాల ప్రజలు, బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో, ప్రధాన సామాజిక ఆర్థిక స్రవంతిలో ముందు వరుసలో చేరిన వాస్తవాన్ని దేశం గుర్తించిందని, అందుకు కేసీఆర్ ఆనందం వ్యక్తం చేసారు. ఫూలే స్ఫూర్తితో తొలి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని, తద్వార మాత్రమే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా మైనారిటీ పేద వర్గాలకు ఫూలే దంపతుల ఆకాంక్షలు నిజమై, సామాజిక న్యాయం జరుగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.