ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ : 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారుగా..

KCR Announce PRC For Employees. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు

By Medi Samrat  Published on  22 March 2021 7:29 AM GMT
KCR Announce PRC For Employees

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. సోమ‌వారం శాస‌న‌స‌భ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. తాజా ప్ర‌క‌ట‌న‌తో 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని సీఎం తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర అనిర్వ‌చ‌నీయ‌మైన‌ది అని కొనియాడారు. ఉమ్మ‌డి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడింద‌న్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచ‌డంలో టీఎన్జీవో స్ఫూర్తి మ‌రువ‌లేనిది అని స్ప‌ష్టం చేశారు.

అలాగే.. త్వ‌ర‌లోనే ఉద్యోగుల‌ ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అలాగే.. ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీల‌కు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే.. క‌రోనా వ‌ల్ల ఈసారి వేత‌న స‌వ‌ర‌ణ ఆలస్య‌మైంద‌ని.. ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి చేసుకుంటున్నామ‌ని అన్నారు. ఇక‌ పీఆర్సీపై ప్ర‌భుత్వం నియ‌మించిన‌ త్రిస‌భ్య క‌మిటీ అన్ని ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించిందని అన్నారు.

తాజా నిర్ణ‌యంతో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

• రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతోపాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100శాతం అర్హులైన ఉద్యోగులందరు ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది.

1. పీ.ఆర్.సి. కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈ.హెచ్.ఎస్) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

2. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) కు ఉన్న వయో పరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

3. గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా (Management wise) అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

• ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతోపాటు, ఆ సంఖ్య పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

4. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది.

5. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం.

6. కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

7. విధి నిర్వహణలో మరణించిన సీ.పీ.ఎస్.(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

8. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతోపాటు, కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది.

కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించడంతోపాటు, ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి.

కరోనా వల్ల రాబడి తగ్గి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పి.ఆర్.సి.కి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోపాటు, కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది.

9. ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

10. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది.

11. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకిత భావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది.




Next Story