జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
By - Medi Samrat |
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన ఆరు పేజీల లేఖలో ఆయన పోలీసుల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని తన నంది నగర్ నివాసం గోడపై నోటీసును అతికించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం పట్ల ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జూబ్లీహిల్స్ ఏసీపీకి తనకు ఇటువంటి నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను విచారించాల్సి వస్తే, అది వారి నివాసం వద్దే జరగాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని ఆయన గుర్తు చేశారు.
తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లి గ్రామమని, నిబంధనల ప్రకారం అక్కడే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో హరీష్ రావు నోటీసుల విషయంలో పాటించిన పద్ధతులను, తన విషయంలో పోలీసులు పాటిస్తున్న వైఖరిని పోల్చి చూపిస్తూ.. పోలీస్ శాఖ ‘డబుల్ స్టాండర్డ్స్’ పాటిస్తోందని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్న చిరునామాకు, ప్రస్తుతం తాను నివసిస్తున్న చోటికి మధ్య వ్యత్యాసాన్ని గమనించకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో కేసీఆర్ సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.
‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సీబీఐ’ కేసు తీర్పు ప్రకారం.. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల్లో నోటీసులు పంపడం చట్టబద్ధం కాదన్నారు. పోలీసులు కావాలనే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, వారి చర్యలు ఆర్టికల్ 14 , 21లకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఒకవేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన ఈ నోటీసులను తాను విస్మరించవచ్చని, అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు తాను విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే పోలీసులు అడిగినట్లు కాకుండా.. తన నంది నగర్ నివాసంలోనే విచారణ జరపవచ్చని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తనకు పంపే ఏవైనా నోటీసులు ఉంటే వాటిని తన ఎర్రవల్లి నివాసానికే పంపాలని సూచించారు.