లిక్కర్ స్కాంలో తన పేరు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కల్వకుంట్ల కవిత
Kavitha to file defamation suit against BJP leaders. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
By Medi Samrat Published on 22 Aug 2022 4:24 PM ISTఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపించిన సంగతి తెలిసిందే..! ఇవన్నీ ఆరోపణలని.. కేవలం తన తండ్రి మీద భారతీయ జనతా పార్టీ అక్కసు తీర్చుకోడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని.. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు.
ఈ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు.
కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని అన్నారు. బట్ట కాల్చి మీద వేయాలనుకుంటున్నారని అన్నారు. కక్షపూరితంగానే బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను తన తండ్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని దీన్ని ఓర్వలేకే ఇందంతా చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. సీబీఐ, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని.. బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.