హైదరాబాద్: కేసీఆర్ ఫొటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది..నైతికతగా భావించి కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నా..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 'జాగృతి జనం బాట'..యాత్ర పోస్టర్ రిలీజ్ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నేను ప్రజల దగ్గరకు వెళ్లి వారు ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటాను. కేసీఆర్ కు బిఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్ళల్లా పనిచేశాము. జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుని వెళ్తే నన్ను బిఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది, నైతికతగా భావించి నేను కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నాను. రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా పార్టీ పెట్టవచ్చా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటాము..అని కవిత స్పష్టం చేశారు.
నా రాజీనామాను ఆమోదించాలని నేను పదేపదే కోరుతున్నాను. పార్టీ నన్ను వద్దు అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ పదవి ఎందుకు. కాంగ్రెస్ రాజకీయం ఏంటో అర్ధం కావడం లేదు, నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమో..జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ వైఫల్యం చెందాయి. నేను తెలంగాణ మొత్తం తిరగాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా చిన్న విషయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తెలంగాణ జాగృతికి సంబంధం లేదు..అని కవిత పేర్కొన్నారు.