కరీంగనర్ పట్టణంలో నిన్న ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి విస్తూపోయే విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని కమాన్ చౌరస్తా దగ్గరు కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కనే ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కొలిమి పని చేసుకుని జీవిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును ఓ 16 ఏళ్ల బాలుడు నడిపాడు. ఆ కారు అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. ఘటనా సమయంలో నిందితుడు కారును 100 కిలోమీటర్ల వేగంతో నడిపాడని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారుపై 9 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి.
కాగా కారు నడిపిన 16 ఏళ్ల బాలుడితో పాటు, 17 ఏళ్ల వయస్సున్న అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడికి కారు ఇచ్చిన అతడి తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన బాలుడు 9వ తరగతి చదువుతుండగా, అతడి స్నేహితులు 10వ తరగతి చదువుతున్నారని పోలీసులు చెప్పారు. అయితే వీరంతా తరచుగా కారులో షికారుకు వెళ్లేవారు. ఆదివారం కూడా అలాగే కారులో బయటకు వచ్చారు. ఉదయం పొగమంచు బాగా కరుస్తున్నా.. కారును అతివేగంతో నడిపారు. ఈ క్రమంలోనే బ్రేకుకు బదులు యాక్సిలేటర్‌ను బలంగా నొక్కి ఉంచడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ఇంకా సాగుతోంది.