వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి పంట వేసుకోవచ్చు.!

Karimnagar collector review on paddy cultivation. యాసంగిలో ప్రైవేట్‌ విత్తన కంపెనీలు, సీడ్‌ కార్పొరేషన్‌ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి పంట వేసుకోవచ్చని

By అంజి  Published on  27 Oct 2021 3:18 PM IST
వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి పంట వేసుకోవచ్చు.!

యాసంగిలో ప్రైవేట్‌ విత్తన కంపెనీలు, సీడ్‌ కార్పొరేషన్‌ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి పంట వేసుకోవచ్చని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలపై నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. యాసంగిలో శనగ, పెసర, మినుములు, వేరు శనగ, నువ్వులు, ఆవాలు వంటి పంటలను సాగు చేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందే ఛాన్స్‌ ఉందని కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు.

ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అధీకృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. సీడ్‌ ప్రొడక్షన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కలెక్టర్‌.. హైబ్రిడ్‌ లేదా సూటి రకాల వరి పంటను వేసుకోవచ్చన్నారు. పంటల సాగులో సమస్యలు, సందేహాలపై జిల్లా వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి ప్లానింగ్‌ చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సన్న రకం వడ్లను కొనేందుకు రైస్‌ మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేశారని.. రైతులు సన్న బియ్యం వరి వేసుకోవచ్చన్నారు. అలాగే మెట్ట ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Next Story