గ్రూప్-1 విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్-1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..15 తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించాం. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించాం..అని కవిత పేర్కొన్నారు.
ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. గ్రూప్ -1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయి. ఆ తప్పులను నేను మండలిలో కూడా ఎత్తి చూపాను. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టటంలో మీడియా, సోషల్ మీడియా చాలా సహకరిస్తోంది. వారి ఒత్తిడి కారణంగానైనా ప్రభుత్వం కొంచెమైనా బుద్ది తెచ్చుకోవాలి.. ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు రద్దు చేసి...మళ్లీ రీ ఎగ్జామ్ పెడుతుందని భావిస్తున్నా. రౌండ్ టేబుల్ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు, సీఎంకు పంపిద్దాం. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. విద్యార్థులకు జాగృతి భరోసా ఉంటుందని హామీ ఇస్తున్నాను..అని కవిత తెలిపారు.