హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంద సార్లు చెప్పానని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. విపక్షాలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అల్లిన ఈ అబద్ధాల పుట్టను న్యాయస్థానం ఛేదించిందని, న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు.
సత్యం ఎప్పటికీ ఓడిపోదని, కాసేపు దాచవచ్చని ఆమె పేర్కొన్నారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని దెబ్బతీయడానికే తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ రాజకీయ కుట్రలో తాను తన పిల్లలతో, కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని కోల్పోయానని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
నేపథ్యం:
2024 మే నెలలో ప్రారంభమైన ఈ కేసు కారణంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి అగ్రనేతలు నెలల తరబడి జైలు శిక్ష అనుభవించారు. తాజాగా వెలువడిన తీర్పుతో వారందరికీ ఊరట లభించింది. అయితే, సీబీఐ ఈ ఆర్డర్‌ను హైకోర్టులో సవాలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.