ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని, అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. నగరంలోని నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు సీఆర్‌పీసీ 160 కింద కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65 సంవత్సరాలకు పైగా వయస్సు ఉండటంతో పోలీస్‌స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు రావాలి అనుకుంటే రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.