మునుగోడు బరిలో నిలిచిన కేఏ పాల్
KA Paul Filed Nomination On Munugode Bypoll. మునుగోడు ఉప ఎన్నికలలో నేడు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి
By Medi Samrat Published on 14 Oct 2022 11:54 AM GMTమునుగోడు ఉప ఎన్నికలలో నేడు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి నామినేషన్లతో చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు భారీగా అభ్యర్థులు క్యూ లైన్‌లో నిలుచున్నారు. దీంతో గడువు ముగిసే సమయానికి క్యూ లైన్‌లో ఉన్న వారి నామినేషన్లు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రజాశాంతి పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున మునుగోడు బరిలో దిగేందుకు సిద్ధపడ్డ ప్రజా గాయకుడు గద్దర్ చివరి నిమిషంలో వైదొలిగారు. మునుగోడు బరిలోకి దిగేందుకు గద్దర్ నిరాకరించడంతో ప్రజాశాంతి పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కేఏ పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడులో ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా కవి గద్దర్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ ప్రకటించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేఏ పాల్ ఆఫీసుకు వద్దకు వెళ్లిన గద్దర్ కార్యాలయం లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత కూడా గద్దర్ నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో స్వయంగా పాల్ నామినేషన్ వేశారు.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.