ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. క‌విత‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవితను

By Medi Samrat  Published on  11 April 2024 8:45 AM GMT
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. క‌విత‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె అయిన కవిత ఏప్రిల్ 23 వరకూ తీహార్ జైలులోనే క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 15 న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది.

గతంలో కవిత మాట్లాడుతూ.. సీబీఐ తన వాంగ్మూలాన్ని జైలులో నమోదు చేసిందని.. ఇది రాజకీయ ప్రేరేపిత‌ కేసు అని ఆరోపించారు. ఇది ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు మోప‌బ‌డిన కేసు.. ఇదివరకే సీబీఐ నా వాంగ్మూలాన్ని జైల్లో నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సీబీఐ అధికారులు ఇటీవల కవితను జైలులోనే ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించేందుకు ఏప్రిల్ 6న సీబీఐ తీహార్ జైలుకు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదిలావుంటే.. తన కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్ వేసింది. కానీ న్యాయస్థానంలో ఊరట లభించలేదు. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కూడా త్వరలో ధర్మాసనం విచారించనుంది.

Next Story