తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో అడ్ హక్ కమిటీల నియామకం చేపట్టారు. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరు రామ్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియామకం చేపట్టినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 30 రోజుల పాటు అడ్ హాక్ కమిటీ పనిచేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం, GHMC 300 వార్డుల్లో పర్యటించి నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి ఈ అడ్ హాక్ కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురానున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చేసేలా నూతన కమిటీల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.