కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో సీఎం రేవంత్ కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సాగుతోన్న నికృష్ట పాలన, ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన వారు, రాష్ట్రంలో ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీకి ఎవరికిచ్చారని ప్రశ్నించారు. నెలకు రూ.2500 తీసుకున్న మహిళలు ఎవరు? తులం బంగారం ఆడబిడ్డలు ఎవరని నిలదీశారు. రైతు భరోసా రూ.7,500 ఇచ్చిందెక్కడ అని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. ఆసరా పింఛన్లు రూ.4 వేలు చేసిందెక్కడ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ? విద్యార్థినీలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఇక్కడ హామీలకు దిక్కులేదు కానీ, అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఢిల్లీ గల్లీలో కాదు.. దమ్ముంటే ఉద్యోగాలు ఇచ్చామని అశోక్‌నగర్ గల్లీలో చెప్పాలని డిమాండ్ చేశారు. జాగో ఢిల్లీ జాగో అని కేటీఆర్ ట్వీట్ చేశారు.