సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యం లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా తన చిన్ననాటి మిత్రులతో కలిసి జగ్గారెడ్డి పతంగులు ఎగరవేశారు. అనంతరం పాత పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఉదయం 12 గంటలకు మొదలుకుని సాయంత్రం 5 గంటల వరకు ఈ సంబరాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మనకు పూర్వీకులు ఇచ్చిన కానుకలని, కష్టాలను, బాధలను మర్చిపోయి పండుగ రోజు అందరూ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్, రామ్ మందిర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.