రెస్టారెంట్ బిల్లుల్లో రూ.70,000 కోట్ల భారీ స్కామ్..హైదరాబాద్ ఐటీ శాఖ మెగా ఆపరేషన్

గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని కొన్ని రెస్టారెంట్లపై జరిగిన సాధారణ దాడులు.. దేశవ్యాప్త పన్ను ఎగవేత రాకెట్‌ను బయటపెట్టాయి

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 5:07 PM IST

Income Tax, Hyderabad, Restaurant Scam, Tax Evasion, IT Raid, Telangana, AndhraPradesh

రెస్టారెంట్ బిల్లుల్లో రూ.70,000 కోట్ల భారీ స్కామ్..హైదరాబాద్ ఐటీ శాఖ మెగా ఆపరేషన్

గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని కొన్ని రెస్టారెంట్లపై జరిగిన సాధారణ దాడులు.. దేశవ్యాప్త పన్ను ఎగవేత రాకెట్‌ను బయటపెట్టాయి. ఐటీ శాఖ జరిపిన లోతైన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్న లక్షకు పైగా రెస్టారెంట్లు, బ్యాకెండ్ నుండి బిల్లులను డిలీట్ చేసి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 70,000 కోట్ల అమ్మకాలను దాచిపెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

డేటా విశ్లేషణ:

సుమారు ఒక లక్షకు పైగా రెస్టారెంట్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన 60 టెరాబైట్ల డేటాను ఐటీ శాఖ విశ్లేషించింది. 2019 నుండి 2026 వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి నగదు (Cash) రూపంలో తీసుకున్న బిల్లులను సాఫ్ట్‌వేర్ బ్యాకెండ్ నుండి తెలివిగా డిలీట్ చేస్తున్నాయి. దీనివల్ల టర్నోవర్ తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, జీఎస్టీని ఎగ్గొడుతున్నాయి.

ఏఐ (AI)తో బట్టబయలు:

ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించడానికి ఐటీ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు జనరేటివ్ AI టూల్స్‌ను ఉపయోగించి 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలను ట్రేస్ చేశారు. ఏపీ, తెలంగాణల్లోని 3,734 పాన్ (PAN) కార్డులను విశ్లేషించగా.. ఐదేళ్లలో రూ. 5,141 కోట్ల విక్రయాలను దాచిపెట్టినట్లు తెలిసింది. కేవలం 40 రెస్టారెంట్లలో జరిపిన సోదాల్లోనే రూ. 400 కోట్ల ఎగవేత బయటపడింది.

దేశవ్యాప్తంగా కర్ణాటక (₹2,000 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ (₹1,500 కోట్లు), తమిళనాడు (₹1,200 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఇంత పెద్ద మొత్తం బయటపడటంతో, మిగిలిన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లపై కూడా ఐటీ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం ఒకే ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంత స్కామ్ బయటపడటంతో, ఇతర బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లపై కూడా సీబీడీటీ (CBDT) నిఘా పెంచింది.

Next Story