హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తిరిగి టీఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్, బీజేపీ వర్గాల నుంచి ఈ సమాచారం అందుతోందని ప్రముఖ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది. ఈటల రాజేందర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి కేసీఆర్ ఊపిరాడకుండా చేస్తున్నాడని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించేందుకు కేసీఆర్ పదునైన వ్యూహాలు పనుతున్నారని తెలుస్తోంది.
ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ పుంజుకోకుండా చేయొచ్చని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈటల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే విషయాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఆ పార్టీ చేస్తున్న ఆఫర్ల గురించి తమ పార్టీకి తెలుసునని అంటున్నారు. అయితే ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లరనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా గులాబీ పార్టీ ఇలాంటి ఆఫర్లను ఇచ్చిందని మరో కాషాయ పార్టీ నేత పేర్కొన్నారు.
కాగా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న వాదనలను తోసిపుచ్చిన ఈటల రాజేందర్.. బీజేపీలో తన ఎదుగుదలను అడ్డుకునేందుకే టీఆర్ఎస్ తనపై ఈ దుష్ప్రచారాన్ని చేస్తోందని అన్నారు.