తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. మద్యపాన నిషేధం గురించి కూడా..!

తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 26 March 2025 8:29 AM IST

తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. మద్యపాన నిషేధం గురించి కూడా..!

తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “ఏ ఇజమూ లేదు, టూరిజమే ముఖ్యం” అనే వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఈ మాటలు కోపాన్ని కలిగించేవని, కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉంటే అది టూరిజమేనని సాంబశివరావు అన్నారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. నేలకొండపల్లి, పాపికొండలు, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని కోరారు.

భద్రాద్రి ఆలయానికి ఉమ్మడి ఏపీ హయాంలో అన్యాయం జరిగిందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పర్యాటక ప్రాంతం అవుతుందని తెలిపారు. ఖమ్మంలో గత పదేళ్లలో రోడ్లు వేయలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధి పనులపై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం తీసుకొస్తే సంతోషిస్తామని అన్నారు.

Next Story