Telangana: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
By అంజి Published on 5 March 2025 6:12 AM IST
Telangana: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్.. 9:05 గంటల తర్వాత నో ఎంట్రీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతి ఇస్తారు. నేడు 4,88,448 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్‌లోకి అనుమతిస్తారు. వాచ్, స్మార్ట్, వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. సెల్‌ఫోన్లు, పేజీలు, క్యాలిక్యులెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ముద్రిత సామగ్రిని పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించరు.
పరీక్షకేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో బీఎన్‌ఎస్ 163(144 సెక్షన్) అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో విద్యార్థుల కోసం తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కోసం ఒక ఏఎన్‌ఎంను నియమించారు. మరోవైపు ఇప్పటికే పరీక్షా పత్రాలు సమీప పోలీస్‌స్టేషన్లకు చేరాయి. పరీక్ష ప్రారంభానికి ముందు ఈ పరీక్షా పత్రాలను ఆయా ఎగ్జామ్ సెంటర్లకు కార్లలో తరలిస్తారు. పరీక్షల కోసం 29,992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్‌స్కాడ్, 124 సిట్టింగ్ స్కాడ్‌లకు విధులు కేటాయించారు. ఇంటర్‌బోర్డు అబ్జర్వర్లను (పరిశీలకులు) సైతం రంగంలోకి దించనున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిలషించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే గురిపెట్టాలని ఒక సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.